మందార మకరంద మాధుర్యమున

7-150-సీ.

మందార మకరంద మాధుర్యమునఁ దేలు

 మధుపంబు బోవునే మదనములకు?


నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు

 రాయంచ జనునె తరంగిణులకు?

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు

 కోయిల చేరునే కుటజములకుఁ?

బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక

 మరుగునే సాంద్ర నీహారములకు?

తే.

నంబుజోదర దివ్య పాదారవింద

చింత నామృత పాన విశేష మత్త

చిత్త మే రీతి నితరంబుఁ జేర నేర్చు?

వినుతగుణశీల! మాటలు వేయు నేల?"

          తండ్రి హిరణ్యాక్షుడు “హరి గిరి అనకు” అన్నాడు. ప్రహ్లాదుడు నీతిశాలి కదా. గురువు చండామార్కులవారికి సమాధానం చెప్పాడు. వినుతగుణశీల అని సంబోధించాడు. ఆ సందర్భంలోది ఈ అమృత గుళిక. మాధుర్యానికే మాధుర్యం చేర్చే మధురాతి మధురమైన పద్యరత్న మిది మనసును మైమరిపింప జేసెడి మా పోతన్న సీసోత్తమం.  

          ప్రఖ్యాత చరితుడా! వినవయ్య నా మాట. ఎన్నో మాటల్లో చెప్పటం అనవసర మయ్య. ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో ఆ విష్ణుదేవుని దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, ఆ అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశిస్తు ఉంటుంది నా మనస్సు. మరి మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగిన తుమ్మెద ఉమ్మెత్తపూల వైపు పోదుగదా. స్వచ్చమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగులు, వంకల దరి చేరదు కదా. తియ్య మామిడి లేత చిగుర్లు తిని పులకించి పాటలుపాడే కోకిల కొడిసిచెట్ల పైకి వెళ్ళదు కదా. నిండు పున్నమి వెన్నెలలో విహారాలు చేసే చకోర పక్షి దట్టమైన మంచు తెరల మాటుకి పోదుకదా. అలాగే ఇతర విషయాల పైకి నా చిత్తం వెళ్ళదు సుమా.

Comments